వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబకలహాల వల్ల మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గగ్గలపల్లి గ్రామానికి చెందిన రాజుకు భార్యతో కుటుంబకలహాలు చోటుచేసుకున్నాయి. మనస్థాపానికి గురై జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరకొని రాజును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన రాజు జేబులో సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా కుటుంబకలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
బస్టాండులో
అనాథ వృద్ధుడు మృతి
బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వట్టెం గ్రామానికి చెందిన అనాథ వృద్ధుడు గోవింద్ (65) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. బిజినేపల్లి రెండో ఎస్‌ఐ రాజశేఖర్ మృతదేహాన్ని గుర్తించి నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడికి కుటుంబ సభ్యులు లేకపోవడంతో భోజనం లేక అనారోగ్యంతో చనిపోయినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
వీపనగండ్ల: కుటుంబ కలహాల వల్ల ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాణి వివరాల ప్రకారం.. మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన రాచాల శ్రీనివాస్‌గౌడ్ (50) కొన్ని నెలలుగా భార్య, పిల్లలతో మహబూబ్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. తమ సమీప బంధువు చనిపోవడంతో వారు ఇటీవల బొల్లారం గ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం కుటుంబంలో నెలకొన్న ఆస్తి పంపకాల విషయంలో ఆవేశానికి గురైన శ్రీనివాస్‌గౌడ్ తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్పిన్నింగ్ మిల్లులో
కార్మికుడు..
అడ్డాకుల: మండల కేంద్రం శివారులో ఎస్‌ఎస్‌వీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన వినిత్ అడ్డాకుల సమీపంలోని ఎస్‌ఎస్‌వీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని మేనమామ లఖాన్(51) ఇక్కడే పని చేసేందుకు కొన్నాళ్ల క్రితం వచ్చాడు. అతనిని పనికి పెట్టుకోకపోవడంతో మేనల్లుడి వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన లఖాన్ బుధవారం కార్మికులందరు పనిలోకి వెళ్లిన తర్వాత క్వార్టర్స్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కార్మికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మేనల్లుడు వినిత్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తిమ్మాజిపేట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలం భట్టుపల్లితండాకు చెందిన సంధ్య(22)ను, తిమ్మాజిపేట మండలం గొరిట తండాకు చెందిన పాత్లావత్ జగన్‌కు ఇచ్చి 2023 మేలో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడు. మంగళవారం రాత్రి కూతురు చనిపోయిందని, జడ్చర్ల ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తల్లికి సమాచారం అందించారు. సంధ్యకు భర్త, 11నెలల కూతురు ఉంది. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని హత్య చేశారని తల్లి అంజమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment