
ఏం జరుగుతోంది?
విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు
● గత డీఈఓ ఏసీబీకి చిక్కినా మారని తీరు
● ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల జారీలో చేతివాటం
● లంచం ఇస్తే కాని ముందుకు కదలని ఫైల్స్
● సమగ్ర విచారణ జరిపించాలని డీఆర్‌ఓకు విద్యార్థి సంఘాల ఫిర్యాదు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు సిబ్బంది ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. మండల స్థాయిల్లో అధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. ఐదు నెలల క్రితం ఓ టీచర్ ప్రమోషన్ విషయంలో సాక్షాత్తు అప్పటి డీఈఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు వివిధ స్థాయిల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ.. యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లంచాలకు అలవాటు పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఆర్‌ఓ రవికి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు, ఇతర ఫైల్స్ విషయంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణకు డీఆర్‌ఓ ఆదేశించినట్లు తెలిసింది. అయితే డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ మొదలు.. కిందిస్థాయి అధికారుల వరకు డబ్బులు ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నేరుగా వెళ్తే పని జరగడం లేదని.. మధ్యవర్తుల ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయని విమర్శలున్నాయి. జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. తనిఖీలకు వెళ్లే అధికారులకు కొంత మొత్తం అప్పగిస్తే ఆ పాఠశాలల జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
● జిల్లాలోని ఓ పాఠశాల అప్‌గ్రేడేషన్ కోసం యాజమాన్యం ఎంఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట ఆఫ్‌లైన్ పద్ధతిలో డీఈఓ కార్యాలయానికి ఫైల్ పంపించేందుకు డబ్బులు తీసుకున్నారని.. తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పాఠశాలకు అనుమతి రాలేదు.
●
● జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలో ఓ పాఠశాలకు 2024 జీఓ ప్రకారం పేరు మార్చేందుకు అవకాశం లేదు. కానీ యాజమాన్యం పేరు మార్చి.. పాత పాఠశాల పేరు మీదే అనుమతులు ఉన్నట్లు కొనసాగిస్తున్నారు.
● జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాలను న్యూటౌన్ నుంచి శేషాద్రినగర్‌కు మార్చారు. అయినా పాఠశాల భవనం పేరు మీదే అనుమతులు ఉ న్నట్లు తెలుస్తోంది. ఎవరైనా అడిగితే అనుమతి కోసం దరఖాస్తు చేశామని.. ఫైల్ ప్రాసెస్‌లో ఉందని యాజమాన్యం బుకాయిస్తోంది.
● జిల్లాలోని కోశెట్టపల్లిలోని ఓ పాఠశాల యాజమాన్యం తమకు తెలుసని.. వసతులు లేకపోయినా ఆగమేఘాల మీద పాఠశాలకు 1 నుంచి 7వ తరగతి వరకు ఓ అధికారి అనుమతులు ఇప్పించారని ఆరోపణలున్నాయి.
● జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, రాజాపూర్, అడ్డాకుల, దేవరకద్ర తదితర మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 30కి పైగా ప్రీప్రైమరీ, ప్లేస్కూల్స్ పేరుతో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలలకు మిక్స్‌డ్ ఆక్యూపెన్సీ ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చారు.
● ఇటీవల నిర్మాణం పూర్తయిన ఓ పాఠశాలకు ఫైర్‌సేఫ్టీ లేకపోయినా.. సర్టిఫికెట్ తీసుకువచ్చారు. ఇక్కడి అధికారులు నేరుగా ఉన్నతాధికారుల అనుమతుల కోసం ఫైల్‌ను పంపించారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.
మచ్చుకు కొన్ని..
Comments
Please login to add a commentAdd a comment