మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం: పీయూ వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్‌రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ హ్యాండ్‌బాల్ ఎంపికలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన ప్రణయ్, జాన్‌పాల్, తన్వీర్, శివకుమార్, నరేష్ పవర్, జయప్రకాష్, నాగరాజు, డోకూరు శ్రీధర్, రామకృష్ణ, గౌస్, రాహుల్, గాంధీ.. మొత్తం 12 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు ఈ నెలాఖరులో తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో జరగనున్న సౌత్‌జోన్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పీయూ రిజిస్ట్రార్ చెన్నప్ప ఎంపికై న విద్యార్థులను అభినందించి.. పీయూకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, సత్యభాస్కర్ పాల్గొన్నారు.
మీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి
● ఎంపీ బండి సంజయ్‌కుఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచన
జడ్చర్ల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని, ముందుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉదండాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు అధ్యక్ష పదవిని కోల్పోయిన బండి సంజయ్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడాలని హితవు పలికారు. పక్క రాష్ట్రం ఏపీలో బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా నిధులు తెచ్చుకుంటుంటే 8 మంది ఎంపీలు ఉండి ఇక్కడేమో చోద్యం చూస్తున్నారని, కేంద్రంతో నిధుల కోసం కొట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీటీంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటే మీకేం ఇబ్బంది అన్నారు. బీజేపీ ధ్యాసంతా ప్రభుత్వాలు కూల్చడంపైనే ఉందని మండిపడ్డారు. రాజధాని నడిబొడ్డున ఓ హోటల్‌లో తాము నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment