గద్వాల క్రైం/ మదనాపురం: గుర్తు తెలియని రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున వనపర్తి రోడ్, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ మధ్య 167 కిలోమీటర్ దగ్గర గుర్తుతెలియని యువకుడు(31) రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే ఫోన్ నం.83412 52529ను సంప్రదించాలని కోరారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
గోపాల్‌పేట: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రేవల్లి మండలం కొంకలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ మల్లయ్య వివరాల మేరకు.. కొంకలపల్లికి చెందిన కల్మూరి శివలీల (38), బంగారయ్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన శివలీల.. తెల్లవారుజామున తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
గొంతు కోసుకున్న
యువకుడు
మహమ్మదాబాద్: కుటుంబ తగాదాలతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహమ్మదాబాద్ మండలం చౌదర్‌పల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చౌదర్‌పల్లికి చెందిన ఖాసీం కుటుంబ తగాదాలతో మనస్తాపానికి గురై బ్లెడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
అడవి జంతువు దాడిలో
గేదె మృతి
ధన్వాడ: మండలంలోని హనుమాన్‌పల్లి శివారు ని కపిలగుట్టలో పొలం వద్ద కట్టేసిన గేదైపె బుధవారం రాత్రి అడవి జంతు దాడి చేయడంతో మృతిచెందిందని బాధిత రైతు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయగా వారు వచ్చి పరిశీలించారు. దాడి చేసిన జంతువు ఏది అనేది నిర్ధారించేందుకు సమయం పడుతుందని అటవీ శాఖ అధికారి పద్మారావు చెప్పారు.
దూడపై చిరుత దాడి
నారాయణపేట రూరల్: మండలంలోని ఎక్లాస్‌పూర్ శివారులో ఓ లేగదూడపై చిరుత దాడికి పాల్పడింది. గురువారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు లేగదూడ మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇ వ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడ లు ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సమీపంలోని గుట్టల నుంచి చిరుత వచ్చి దూడపై దాడికి చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో గురువారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడయ కాల్వ ద్వారా 160 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
మైనర్లతో వెట్టిచాకిరీ నేరం
ఉప్పునుంతల: మండలంలోని ఫిరట్వానిపల్లిలో బాల కార్మికుడితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న పెంటయ్య, శ్రీనివాసులుపై తహసీల్దార్ సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లికి చెందిన బాలుడితో రెండున్నరేళ్లుగా పని చేయించుకుంటున్నారు. ఈ విషయంపై ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఈనెల 18న తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ ఫిరట్వానిపల్లికి వెళ్లి పంచనామా నిర్వహించి అనంతరం ఆ బాలుడిని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌కు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment