అభయారణ్యంలో శివ శరణు ఘోష
అచ్చంపేట: మహాశివుడి శరణు ఘోషతో నల్లమల ప్రతిధ్వనిస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమఃఓం.. అంటూ శివస్వాములు, భక్తులు మార్మోగిస్తున్నారు. శివదీక్ష చేపట్టిన స్వాములతో పాటు భక్తులు చాలా మంది శ్రీశైలం క్షేత్రానికి కాలినకడన తరలివెళ్తున్నారు. నల్లమల దారి పొడువునా శివనామస్మరణ మార్మోగుతోంది. భక్తులకు అడుగడుగునా దాతలు తమకు తోచిన సాయం చేస్తూ.. అండగా నిలుస్తున్నారు. విడిది కేంద్రాలు, అన్నదానాలు, నీళ్ల ప్యాకెట్లు వితరణ చేయడంతో పాటు ప్రథమ చికిత్స అందిస్తూ తమలోని సేవాగుణం చాటుకుంటున్నారు.
రాత్రివేళ అధికంగా..
వివిధ ప్రాంతాల్లో మండల, అర్ధమండల దీక్ష చేపట్టిన శివస్వాములు చాలా మంది కాలినడకన శ్రీశైలం చేరుకొని మహా శివరాత్రి రోజున దీక్షను విరమిస్తారు. అయితే దారిలోనే నిత్యం ఉదయం, సాయంత్రం పవిత్ర స్నానాలు ఆచరించి.. శివాలయాల్లో లింగార్చన, బిల్వార్చనలతో పూజలు చేస్తూ రుద్రనమక చమకాలతో కై లాసనాథుడిని కొలుస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో రాత్రివేళ నడుచుకుంటూ వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు.
విడిది కేంద్రాలు..
పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకువచ్చి షామియానాలు, భోజనం, మంచినీటి సౌకర్యాలతో పాటు అల్ఫాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం, మన్ననూర్, ఫర్హాబాద్, వటువర్లపల్లి, రాసమల్లబావి, దోమలపెంటల వద్ద దాతలు విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. అచ్చంపేట ● శ్రీశైలం నల్లమల అభయారణ్యం మార్గంలో ప్రతి ఏటా 20కి పైగా అన్నదాన కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఉంది. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.
సూచనలు పాటించాలి..
పాదయాత్రగా వచ్చే శివస్వాములు, భక్తులకు అటవీ, పోలీసు శాఖలు ప్రత్యేక సూచనలు చేస్తోంది. నల్లమలలో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ప్రత్యేక ఆంక్షలు విధిస్తోంది. అమ్రాబాద్ అభయారణ్యంతో పాటు రక్షిత ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అడవి జంతువుల నుంచి స్వాములకు ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పిస్తున్నారు.
● శివస్వాములు, భక్తులు అడ్డదారుల్లో వెళ్లరాదు. నిర్దేశిత ప్రాంతాలు, రోడ్డు వెంట మాత్రమే ప్రయాణించాలి. అటవీ మార్గంలోని కాలిబాటలో వెళ్లరాదు.
● రోడ్డకు మధ్యలో నడవకూడదు. రోడ్డుకు ఎమడవైపు నుంచి నడవాలి.
● రోడ్డుపై విశ్రాంతి తీసుకోకూడదు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లో మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఉంటుంది. అక్కడ తాగునీటి వసతి కూడా కల్పించారు.
● అటవీ ప్రాంతంలో వంటలు వండటం, నిప్పు రాజేయడం నిషేధం. నిబంధనలు ఉల్లఘించి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వారిపై అటవీశాఖ చర్యలు తీసుకుంటుంది.
● ఘాట్‌రోడ్డు మలుపుల వద్ద సూచనలను పాటించాలి.
● ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు అడవిలో వేయరాదు.
● రాత్రివేళ పాదయాత్ర చేసే శివస్వాములు టార్చిలైట్ లేదా ముందు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రహదారి సూచనగా తెల్లగుడ్డ కట్టాలి.
● అడవి మధ్య మార్గంలో కోతులతో జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహార పదార్థాలు కోతులకు వేయరాదు.
● భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అమ్రాబాద్ సీఐ (87126 57739), ఈగలపెంట ఎస్‌ఐ (87126 57741) నంబర్లను సంప్రదించాలి.
శ్రీశైల క్షేత్రానికి శివస్వాముల పాదయాత్ర
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ప్రధాన రహదారి
రోడ్డు మార్గంలో వెళ్లాలి..
శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న స్వాములు, భక్తులు రోడ్డు ప్రమాదంలో వెళ్లడం సురక్షితం. అడవి మార్గంలో జంతువుల నుంచి ప్రమాదం ఉంటుంది. ధారా బేష్ క్యాంపు, రాసమల్లబావి వద్ద భక్తులకు తాగునీటి వసతి కల్పిస్తున్నాం. 14 మంది సిబ్బందితో చెత్త సేకరిస్తున్నాం. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త, కవర్లు తీయిస్తాం. మా సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు.
– రోహిత్ గోపిడి, డీఎఫ్‌ఓ
అభయారణ్యంలో శివ శరణు ఘోష
అభయారణ్యంలో శివ శరణు ఘోష
Comments
Please login to add a commentAdd a comment