శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టువస్త్రాలు
అమరచింత: మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే పనుల్లో అమరచింత పద్మశాలీలు నిమగ్నమయ్యారు. ఇందుకుగాను వారం క్రితమే శ్రీశైలం క్షేత్రంలోని పద్మశాలి భవన్‌లో ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని నేత పనులు ప్రారంభించారు. మహాశివరాత్రి నాటికి నేత పనులు పూర్తిచేసి ఆలయ ఈఓకు వీటిని భక్తిశ్రద్ధలతో అందించనున్నారు. ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని సంఘం పట్టణ అధ్యక్షుడు మహంకాళి విష్ణు తెలిపారు. నియమనిష్టలతో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు తయారు చేస్తున్నామని వివరించారు.
అందరి భాగస్వామ్యంతో..
పట్టణంలోని పద్మశాలి కులస్తులందరి భాగస్వామ్యంతోనే పట్టువస్త్రాలు తయారుచేయడం అనాదిగా వస్తోంది. భక్త మార్కండేయస్వామి పద్మశాలీల కులదైవం.. కాబట్టి ఆయన కొలిచే శివయ్యకు తమవంతుగా పట్టువస్త్రాలు అందిస్తున్నామని కులపెద్దలు వివరించారు. గతంలో అమరచింతలో వస్త్రాలు నేసి శ్రీశైలానికి వెళ్లి అందించే వారమని.. ప్రస్తుతం క్షేత్రంలోనే మగ్గం ఏర్పాటు చేసుకొని తయారు చేస్తున్నట్లు తెలిపారు. అమరచింతలోని శివచౌడేశ్వరి ఆలయం నిర్మించిన మహంకాళి గంగ, శ్రీనివాసులు సోదరులు పట్టువస్త్రాల తయారీకి అయ్యే ఖర్చును ఏటా అందిస్తున్నారని చెప్పారు.
శ్రీశైలంలో కొనసాగుతున్న నేత పనులు
మహాశివరాత్రికి ఆలయ ఈఓకు అందజేత
మహాభాగ్యం..
శ్రీశైలంలో ఉంటూ స్వామి, అమ్మవార్ల పట్టువస్త్రాల తయారీలో పాల్గొనడం మహాభాగ్యంగా భావిస్తున్నా. మగ్గంపై వస్త్రాల తయారీకి అవసరమైన దారం కండెలు చుట్టడం, మగ్గం పనులు చేస్తూ తరిస్తున్నా. – కడుదాసు సిద్ధమ్మ, అమరచింత
శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టువస్త్రాలు
Comments
Please login to add a commentAdd a comment