నల్లమలలో మార్మోగుతున్న శివనామస్మరణ
అచ్చంపేట: నల్లమల కొండల్లో శివనామస్మరణ మార్మోగుతోంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు, భక్తులు కాలినడకన తరలివెళ్తున్నారు. వనపర్తి–అచ్చంపేట, మహబూబ్‌నగర్– అచ్చంపేట, హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారులతో పాటు నల్లగొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుంచి శివస్వాములు శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన తరలివస్తుండటంతో అఽభయారణ్యంలో రద్దీ పెరిగింది. అచ్చంపేట–ఉమామహేశ్వరం మీదుగా అటవీ మార్గంలో శివస్వాములు పాదయాత్ర చేస్తున్నారు. మదిలో శివయ్యను తలుస్తూ.. సుదూర ప్రాంతాల నుంచి అలుపెరగని కాలినడక సాగిస్తున్నారు. ఏ చెట్లు, గుట్టలు, కాలిబాటలు చూసిన శివస్వాములే దర్శనమిస్తున్నారు. ఎంతో నిష్టతో 41 రోజులపాటు శివదీక్ష బూని భక్తిపారవశ్యంతో ముందుకు సాగుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక, సామాజిక సేవకులు అన్నదానం, తాగునీటి సదుపాయం కల్పిస్తూ.. శివస్వాములు సేవలు అందిస్తున్నారు. మరికొందరు పండ్లు పంపిణీ చేస్తున్నారు.
● మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం ఉత్తరద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో శివస్వాములు, భక్తులకు మేఘ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి 21 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివస్వాములు, భక్తులకు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందన్నారు. ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భీరం మాధవరెడ్డి, పవన్, కృష్ణారెడ్డి, మన్సూర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment