బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలి
● మహబూబ్‌నగర్‌లో ఈనెల 9న బీసీల రాజకీయ సదస్సు
● బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త జానయ్య యాదవ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీలు తమ న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్జీఎస్ భవన్‌లో బీసీ సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 9న మహబూబ్‌నగర్‌లో జరిగే బీసీ రాజకీయ సదస్సును విజయవంతం చేస్తామని అన్నారు. ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరవుతారని, ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున బీసీలు హాజరు కావాలన్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 2028లో బీసీలు ఎమ్మెల్యేలు అవుతారని, ‘మన ఓటు మనకే వేసుకుందాం’ అనే నినాదంతో బీసీల రాజ్యాధికారాన్ని సాధించుకుందామని అన్నారు. బీసీ నాయకులు తమ్మడ బోయిన అర్జున్, ఎల్లబోయిన ఓదెలు యాదయ్య మాట్లాడారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ సాగర్, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైత్రి యాదయ్య, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, వివిధ కుల సంఘ ప్రతినిధులు మెట్టుకాడి ప్రభాకర్, మహేందర్, శేఖరాచారి, శివన్న, అశ్విని సత్యం, బీసీ మేధావులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment