చిన్నచింతకుంట: బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చిన్నచింతకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అమరచింత మండలం మస్థిపురం గ్రామానికి చెందిన ఇంకోలా గుండమ్మ (77) గత నెల 28న అమవాస్య సందర్భంగా కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాలలో అక్కడ ఇక్కడ తిరుగుతూ పలువురికి కనిపించింది. మంగళవారం కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. గూడూరు గ్రామ శివారులోని అబ్దుల్ ఖాదర్ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని హీర్లతండాలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం ఖిల్లాఘనపురం మండలంలోని హీర్లతండాకు చెందిన పాత్లావత్ హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. సోమవారం ఇంటి వ్యవహరంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైపుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయమై మృతుడి భార్య వాలీబాయి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ బద్రునాయక్ తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
బల్మూర్: బాలికను లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడు తిరుపతయ్యపై ఏఎస్పీ సీహెచ్ రామేశ్వర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు షీటీం జిల్లా ఇన్‌చార్జ్ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికను ప్రధానోపాధ్యాయుడు 20 రోజుల క్రితం లైంగికంగా వేధించాడని.. బాలిక కాళ్లపై పడి వేడుకున్న వినిపించుకోలేదని వివరించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తిరుపతయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై టీడీటీఓ ఆదేశాల మేరకు ఏటీడీఓ సోమవారం ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.
ఏటీఎంలో
చోరీకి యత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: పుర పరిధిలోని ఉయ్యాలవాడ ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తికి చోరీకి యత్నించిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్ కథనం మేరకు.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లికి చెందిన నారాయణ ఉయ్యాలవాడలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నిస్తుండగా అలారం మోగడంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని నారాయణను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
హైనా దాడిలో
లేగ దూడ మృతి
తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట గ్రామానికి చెందిన జగ్గని వెంకటయ్య తన వ్యవసాయ పొలంలో సోమవారం సాయంత్రం గేదెలను కట్టేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం పొలానికి వెళ్లి చూడగా గుర్తు తెలియని జంతువు దూడను చంపి తిన్న విషయం గుర్తించాడు. ఘటనపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు హైనా దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ పొలం వద్ద సాయంత్రం పశువులు, గేదెలను కట్టివేసి ఇంటికి వస్తే తెల్లారే సరికి దూడలను హైనా అనే అడవి జంతువు చంపి తింటుంది. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇలా పలు ఘటనలు జరిగినా ఫారెస్టు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలానే గుర్తు తెలియని జంతువులు ఆవు, గేదె దూడలను చంపి తింటున్నాయని పలువురు అంటున్నారు. దూడలను చంపింది హైనా అయి ఉంటుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారే తప్పా.. ఖచ్చితంగా విషయం తెలుపడం లేదని, దానిని పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా దూడలను చంపి తింటున్న గుర్తు తెలియని జంతువును పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.
● భయాందోళనలో రైతులు
● పట్టింపులేని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment