బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
మద్దూరు/కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ ప్రభు (బావాజీ) ఉత్సవాలు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కొనసాగనున్నాయని.. జాతరకు వచ్చే గిరిజన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని ఆలయ ఆవరణలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలంతో కలిసి జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంగణంలో మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం 80 మరుగుదొడ్లు ఉన్నాయని మిషన్ భగీరథ ఈఈ రంగారావు వివరించారు. అవసరమైతే అదనంగా ఏర్పాటు చేయాలని, అలాగే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి 10 గదులు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. వేసవి దృష్ట్యా భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. 210 మంది కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు డీపీఓ కృష్ణ వివరించారు. జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాలని, భక్తులు సమర్పించిన నైవేద్యాలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు, ట్రాక్టర్ వెళ్లడానికి రహదారి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రథోత్సవం జరిగేటప్పుడు విద్యుత్ తీగలు తగలకుండా చూస్తామని.. ఇందుకోసం అదనంగా 20 స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాదాయశాఖ నుంచి 30 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై పంపించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గతేడాది రథోత్సవం సమయంలో పోలీసు బందోబస్తు సరిగా లేదని ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్సవాల పర్యవేక్షణకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం గురులోకామాసంద్ ప్రభు, కాళీకాదేవిని ఆమె దర్శించుకున్నారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డా. సౌభాగ్యలక్ష్మి, పీఆర్ ఈఈ హీర్యానాయక్, మద్దూరు, కొత్తపల్లి మండలాలకు చెందిన వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
మండల కాంప్లెక్స్ నిర్మాణ స్థల పరిశీలన..
కొత్త మండల కేంద్రం కొత్తపల్లిలో రూ.8.80 కోట్లతో నిర్మించే మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థల పరిశీలన చేశారు. వెయ్యి గజాల స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణ నమూనాను చూసి ప్రధాన రహదారి నుంచి కాంప్లెక్స్ వరకు రహదారి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment