నకిలీ పోలీసులతో అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్‌నగర్ క్రైం: డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి నకిలీ సీబీఐ, ఆదాయపు పన్ను, పోలీస్ అధికారులంటూ భయాందోళనకు గురి చేయడానికి చూస్తుంటారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రాములు అన్నారు. సైబర్ నేరాలపై బుధవారం ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మీ బ్యాంక్ ఖాతా టెర్రరిస్టులతో లింక్ అయ్యిందని, మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెడుతూ మెసేజ్‌లు చేస్తారని వెల్లడించారు. ఖాతాలు ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే వాళ్లు చెప్పిన ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయాలని మోసం చేస్తుంటారన్నారు. పోలీసులు ఎప్పుడూ కూడా ఫోన్‌లలో కేసులపై విచారణచేయడం జరగదని, ఫోన్‌లలో డబ్బులు అడగటం ఉండదని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలు కావడంతో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పేరుతో భయపెడుతారని, స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ల వాడకంపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థినులను అధికంగా భయపెడతారని, వేధింపులకు గురైతే సైబర్ పోలీసులకు, 1930 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు 8712672222కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆనంతరం సైబర్ క్రైం డీఎస్పీ సుదర్శన్ వైద్యవిద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్గించారు. సైబర్ క్రైం సీఐ గోపాల్, రూరల్ సీఐ గాంధీనాయక్, ఐటీ సెల్ ఎస్‌ఐ రవి పాల్గొన్నారు.
● ఏఎస్పీ రాములు
Comments
Please login to add a commentAdd a comment