మహబూబ్‌నగర్‌కే ఎక్కువ నిధులా? | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌కే ఎక్కువ నిధులా?

Published Tue, Mar 11 2025 1:14 AM | Last Updated on Tue, Mar 11 2025 1:13 AM

మహబూబ్‌నగర్‌కే ఎక్కువ నిధులా?

మహబూబ్‌నగర్‌కే ఎక్కువ నిధులా?

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ముడా నుంచి జిల్లాలోని మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎలా అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ముడా కార్యాలయంలో చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నుంచి మహబూబ్‌నగర్‌ (పరిగి నియోజవకర్గంలోని రెండు మండలాలు కలుపుకొని)కు 40 శాతం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు 30 శాతం చొప్పున మంజూరు చేస్తే బాగుంటుందన్నారు. అందుకు వైస్‌ చైర్మన్‌ డి.మహేశ్వర్‌రెడ్డి అంగీకారం తెలిపారు. ఇక గతంలోనూ మహబూబ్‌నగర్‌కు తప్పా ఇతర నియోజకవర్గాలకు అసలు కేటాయింపులే జరగలేదని ఆయన వాపోయారు. జిల్లాకేంద్రంలోని పది పార్కుల అభివృద్ధికి అయ్యే రూ.3.30 కోట్లను కేవలం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధుల నుంచి కేటాయించాలన్నారు. ఇదివరకే చేపట్టిన పనుల్లో తన నియోజకవర్గంలో 34 పెండింగ్‌లో ఉన్నాయని, ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. కాగా, జిల్లాలో ఏఈల కొరత తీవ్రంగా ఉందని, చాలా చోట్ల డిప్యూటేషన్‌పై పని చేస్తున్నందున ఈ పరిస్థితి నెలకొందని పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి బదులిచ్చారు. ముడాకు ప్రత్యేకంగా ఈఈ, ఇద్దరు డీఈఈలు, నియోజవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఏఈ పోస్టులు కేటాయిస్తే పనులు త్వరగా చేపట్టడానికి వీలవుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముడా పాలకవర్గం అమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి సూచించారు.

కేటాయింపులు ఇలా..

ఇక మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి రూ.14,05,06,000లతో 108 పనులు, జడ్చర్లకు రూ.8,21,50,000లతో 142, దేవరకద్రకు రూ.8,20,00,000లతో 192, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్‌, గండేడ్‌ మండలాలకు రూ.1,54,10,000లతో 77 పనులు (ఇలా మొత్తం రూ.32,00,66,000) చేపట్టేందుకు ప్రతిపాదనలు చేయగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. అలాగే కార్పస్‌ఫండ్‌ కింద ముడాకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. జిల్లాకేంద్రంలోని బైపాస్‌, భూత్పూర్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌–167లపై ఐదు చోట్ల మొక్కల పెంపకం, సంరక్షణకు గాను నిర్వహణ ఖర్చుల కింద రూ.1.84 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి

పార్కుల అభివృద్ధిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చూసుకోవాలి

ముడా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement