ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించి ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్‌గా వివిధ శాఖల అధికారులతో జిల్లా ఆహార భద్రత సలహా మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, పరిశ్రమలశాఖ జీఎంలు, డీఈఓ, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం అనుసరించి జిల్లాలో ఆహార భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లాకు నూతనంగా రీజనల్ ఫుడ్ లేబరేటరీ, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ కూడా రాబోతుందని పేర్కొన్నారు. వీటి ద్వారా జిల్లాలో మరింత మెరుగ్గా ఆహార కల్తీ నిరోధానికి పాటుపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షించాలని, రక్తహీనత, ఐరన్ లోపం ఉన్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్ర ప్రతాప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్, డీఈఓ ప్రవీణ్ కుమార్, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికాంత్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి
జిల్లాలో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూగర్భ జల వనరులు తగ్గినా పంటలు ఎండిపోకుండా రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment