ఆ ఏడుగురి కోసం అన్వేషణ | - | Sakshi
Sakshi News home page

ఆ ఏడుగురి కోసం అన్వేషణ

Published Tue, Mar 11 2025 1:12 AM | Last Updated on Tue, Mar 11 2025 1:11 AM

ఆ ఏడు

ఆ ఏడుగురి కోసం అన్వేషణ

ఆ చోటనే గాలింపు

సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్‌ డాగ్స్‌, జీపీఆర్‌ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్‌ హోల్‌ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించనున్నారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌ /అచ్చంపేట రూరల్‌: దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 17 రోజులుగా చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహం ఆదివారం లభించడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్‌ డాగ్స్‌ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్‌, కాడవర్‌ డాగ్స్‌ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్‌ కంపెనీలో టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.

సహాయక చర్యలకు అన్నీ సవాళ్లే..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది. సొరంగం ఇన్‌లెట్‌ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్‌ ద్వారా రాకపోకలకే కనీసం 3–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్‌ వరకూ లోకో ట్రైన్‌ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్‌ ట్రాక్‌ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి. 13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్‌ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్‌ భాగాలను కట్‌చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్‌ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్‌ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్‌ డాగ్స్‌ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.

సొరంగంలో కాడవర్‌

డాగ్స్‌ స్క్వాడ్‌

ప్రమాద స్థలంలో గుర్తించిన డీ2 పాయింట్‌ వద్ద సింగరేణి బృందాలు

టన్నెల్‌లో కాడవర్‌ డాగ్స్‌తో గాలింపు ముమ్మరం

కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్లు

ఇప్పటికే ఒక కార్మికుడి మృతదేహం లభ్యం

ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు

అభినందనల వెల్లువ..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన సహాయక బృందాలను ప్రజాప్రతినిధులు, వివిధ విపత్తుల ఉన్నతాధికారులు అభినందించారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రతీసింగ్‌ మృతిచెందడం బాధాకరమని, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మున్ముందు జరగబోయే సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. డిజాస్టర్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు. అలాగే టన్నెల్‌ వద్ద సహాయక సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి మైన్స్‌, ర్యాట్‌ మైనర్స్‌, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కాడవర్‌ డాగ్స్‌ స్క్వాడ్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆ ఏడుగురి కోసం అన్వేషణ 1
1/1

ఆ ఏడుగురి కోసం అన్వేషణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement