ట్రాక్టర్‌ను ఢీకొట్టి.. బోల్తా పడిన బొలెరో
గద్వాల క్రైం: స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో కొందరు వ్యవసాయ కూలీలు మరో ప్రాంతానికి కూలీ పనుల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో.. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో 26 మంది కూలీలకు గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గద్వాల మండలం జమ్మిచేడ్ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలం పాతపాల్లెం, గంగన్‌పల్లి, జాంపల్లి గ్రామాలకు చెందిన 26 మంది కూలీలు మానవపాడు మండలం ధర్మవరం గ్రామంలో మిర్చి తెంచేందుకు బొలెరో గూడ్స్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని జమ్మిచేడ్ స్టేజీ వద్ద క్రాస్‌రోడ్డు దాటేందుకు ట్రాక్టర్ వేగంగా రావడంతో బొలెరో వాహనం అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో జాంపల్లికి చెందిన సవారన్న, పాతపాలెంకు చెందిన కృష్ణ, పావని, శాంతమ్మ, పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో సవారన్న, కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. ట్రాక్టర్, బొలెరో వాహనం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ తదితరులు జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీను, ఎస్‌ఐలు శ్రీకాంత్, కళ్యాణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నవీన్, బొలెరో వాహన డ్రైవర్ మహబూబ్ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్‌తోనే ప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొట్టి.. బోల్తా పడిన బొలెరో
Comments
Please login to add a commentAdd a comment