విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దకొత్తపల్లి: పంటకు నీరందించేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. యాపట్లకు చెందిన రైతు బక్కయ్యగౌడ్ (60)కు మూడెకరాల పొలం ఉండగా.. వేరుశనగ పంట సాగుచేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీరందించేందుకు వెళ్లిన అతడు.. విద్యుత్ బోరుమోటారు ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
అప్పుల బాధతో
రైతు ఆత్మహత్య
అడ్డాకుల: మూసాపేట మండలం మహ్మదుస్సేన్‌పల్లికి చెందిన రైతు కుర్వ పూల మహేష్(39) పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూసాపేట ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం...మహ్మదుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన మహేష్ ఐదేళ్ల క్రితం రూ.30 లక్షలు ఫైనాన్స్ తీసుకుని రెండు హార్వేస్టర్లు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా నష్టం వాటిల్లడంతో వాటిని అమ్మేశాడు. తర్వాత గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు చేసిన అప్పులు కూడా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన మహేష్ ఈనెల 9న ఉదయం ఇంటి వద్ద పురుగుల మందును తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లి నారమ్మ వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. మృతుడి తల్లి నారమ్మ సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై కేసు నమోదు
అడ్డాకుల: మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పొలానికి నీళ్లు పెట్టుకునే క్రమంలో జరిగిన గొడవలో అన్నపై దాడి చేసిన తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలకిష్టయ్య ఆదివారం సాయంత్రం తన పొలానికి నీళ్లు పారిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన తమ్ముడు రవి నీళ్లు పారించుకునే వంతుల విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో రవి కర్రను తీసుకొని బాలకిష్టయ్యపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో బాలకిష్టయ్య సోమవారం అడ్డాకుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. గాయపడిన బాలకిష్టయ్యను పోలీసులు ఆస్పత్రికి పంపించారు. తమ్ముడు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆన్‌లైన్‌లో పెట్టుబడి..
మోసపోయిన యువకుడు
కొత్తకోట రూరల్: సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎక్కడో చోట ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టి మోసపోతున్న వారు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా కొత్తకోటకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఎస్‌ఐ ఆనంద్ వివరాల మేరకు.. కొత్తకోటకు చెందిన డి.ఉదయ్‌కుమార్‌ను ఈ నెల 3న గుర్తుతెలియ ని వ్యక్తి టెలిగ్రామ్ యాప్‌లో ‘బిట్ కై న్ ఇన్‌వెస్టర్’ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో ఒక లింక్‌ను పంపించి.. అందులో డబ్బులు పె ట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని చెప్పా రు. నమ్మిన ఉదయ్‌కుమార్.. అదే రోజు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.70వేలు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో సైబర్ నేరగాడు రాత్రికి రాత్రే ఆ టెలిగ్రామ్‌లో ఉన్న ఇన్‌వెస్టర్ గ్రూప్ మొత్తాన్ని తొలగించాడు. మోసపోయానని తెలుసుకున్న ఉదయ్‌కుమార్.. 1930కు కాల్ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
నవజాత శిశువును
కాపాడిన 108 సిబ్బంది
నర్వ: నవజాత శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయికోడ్‌కు చెందిన గర్భిణి అఖిల మొదటి కాన్పు నిమిత్తం సోమవారం నర్వ పీహెచ్‌సీకి వచ్చింది. మధ్యాహ్నం సాధారణ ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోలేకయింది. ఈ క్రమంలో శిశువు మరణించిందని అందరూ భావించారు. అయితే ప్రసవం చేసిన నర్సు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. శిశువు అంబులెన్స్‌లోకి తీసుకొని ఆర్‌సీపీ డాక్టర్ శివ, మరో డాక్టర్ మౌనిక సూచనలతో సీపీఆర్ చేశారు. నవజాత శిశువుకు మందులు, ఆక్సిజన్ అందిస్తూ.. మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును సీపీఆర్‌తో కాపాడిన 108 సిబ్బందిని చిన్నపిల్లల వైద్యురాలు మమత అభినందించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Comments
Please login to add a commentAdd a comment