నాగర్‌కర్నూల్ క్రైం: జల్సాలకు అలవాటుపడి దారి దోపిడీకి యత్నించిన ఓ ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. వనపర్తికి చెందిన బొల్లెమోని బాబు, బొల్లెమోని అంజి, పుట్టపాకుల శ్రీకాంత్, హైదరాబాద్‌కు చెందిన నందిమళ్ల హరిగణేశ్, యాత రవి, పెంట్లవెల్లికి చెందిన గిరిధర్‌నాయుడు, సాయికుమార్, హరికృష్ణ, అఖిల్ జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతుండేవారు. పెంట్లవెల్లికి చెందిన రాజవర్ధన్, వెంకటేశ్వర్లు, రమేష్, రాఘవేంద్రాచారి బంగారు వ్యాపారులు. వీరంతా ఈ నెల 6న బంగారు కొనుగోలుకు హైదరాబాద్ బయలుదేరారు. నిందితుడు సాయికుమార్ ఈ సమాచారాన్ని బొల్లెమోని బాబుకు అందించడంతో పాటు హరికృష్ణ, గిరిధర్ నాయుడుకు ఓ అద్దె కారు, సెల్‌ఫోన్ అప్పగించి బంగారు వ్యాపారస్తుల కారు వెంటే వెళ్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఆ వ్యాపారులు హైదరాబాద్‌లోని కాళీకమాన్ వద్ద బంగారు కొనుగోలు చేసి బయలుదేరగా నిందితులు మిగతా వారిని అప్రమత్తం చేయడంతో పాటు వారి వెంటే వచ్చారు. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి శివారు కేఎల్‌ఐ వంతెన వద్ద స్వామి, అంజి రాళ్లు అడ్డుపెట్టడంతో పాటు సిమెంట్ దిమ్మెలను, అఖిల్ తల్వార్‌ను చేతిలో పట్టుకోవడంతో పాటు హరిగణేష్, రవి, శ్రీకాంత్ రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు. బంగారు వ్యాపారుల కారు అక్కడికి చేరుకోగానే నిందితులు కారుపై సిమెంట్ దిమ్మెలతో దాడి చేసేందుకు యత్నించగా అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి వేగంగా తప్పించుకొని వెళ్లిపోయారు. బంగారు వ్యాపారి రాజవర్ధన్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి కొల్లాపూర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా బొల్లెమోని బాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించడంతో పాటు మిగతా వారి సమాచారం ఇవ్వడంతో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 24 చోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి వేర్వేరు దొంగతనాలకు సంబంధించి 10 తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు, దారి దోపిడీకి యత్నించిన కారు, రెండు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని.. కోర్టు అనుమతితో మరోమారు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్పారు.
10 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాల స్వాధీనం
వివరాలు వెల్లడించిననాగర్‌కర్నూల్ ఎస్పీ
దారిదోపిడీకి యత్నించిన ముఠా అరెస్ట్