అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఏడుగురు కార్మికుల ఆచూకీ కోసం 26వ రోజు బుధవారం సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సొరంగంలోని పరిస్థితులపై మరోమారు అధ్యయనం చేసి సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మినీ ఇటాచీ ద్వారా తవ్వకాలు చేపట్టి మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. కేరళకు చెందిన కడావర్ డాక్స్ గుర్తించిన డి–1, డి–2 ప్రదేశాల్లో సింగరేణి మైన్స్, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, కడావర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్, దక్షిణమధ్య రైల్వే, జీఎస్‌ఐ, జలవనరులశాఖల బృందాలు పనిచేస్తున్నాయి.
అందుబాటులోకి రాని రోబోల సేవలు..
వారం రోజులైనా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబో అనుసంధానంగా ఏర్పాటు చేసిన వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా సొరంగం వద్దే ఉండిపోయాయి. సొరంగం చివరి పాయింట్ 40 మీటర్ల వద్ద రోబోలతో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్టాలేషన్, సిగ్నలింగ్ సమస్యగా చెబుతున్నా.. టీబీఎం శకలాలు అడ్డుగా ఉండటంతోనే వీటి సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో ద్వారా మట్టి, బురద, రాళ్లు బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు.
1,600 టన్నుల స్టీల్, మట్టి తరలింపు..
ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు. నాలుగు ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లతో నిరంతరాయంగా మట్టి, స్టీల్ తొలగింపు పనులు చేపడుతున్నారు. లోకో ట్రైన్‌తోనే తరలింపు వేగవంతం అవుతుందని గుర్తించిన అధికారులు ప్రమాద స్థలం వరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. వాటర్ జెట్ సాయంతో బురదను బయటకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు.
ఎస్కవేటర్లతో పనులు ముమ్మరం..
సొరంగంలో టీబీఎం ప్లాట్‌ఫామ్ భాగాలు కత్తిరించే ప్రక్రియ, ఎస్కవేటర్లతో మట్టి తొలగింపు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్‌థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య సొరంగం లోపలి పరిస్థితులు వివరించారు. డి–1, డి–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, టీబీఎం భాగాలను అల్ట్రా థర్మల్ కట్టర్‌తో తొలగిస్తూ మట్టిని ఎస్కవేటర్లు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాల ఉన్నతాధికారులు సొరంగం లోపల ప్రమాద స్థలంలో ఉంటూ సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు.
26 రోజులైనా జాడే లేదు