మామిడి రైతుకు.. మార్కెట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుకు.. మార్కెట్‌ కష్టాలు

Apr 3 2025 1:26 AM | Updated on Apr 3 2025 1:26 AM

మామిడి రైతుకు.. మార్కెట్‌ కష్టాలు

మామిడి రైతుకు.. మార్కెట్‌ కష్టాలు

కొల్లాపూర్‌: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్‌ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్‌లో మార్కెట్‌ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్‌ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్‌తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లావ్యాప్తంగా 34,712 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే 25,237 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్‌ మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఇక్కడి పండ్లకు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్‌ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కొన్నేళ్లుగా పాలకులను కోరుతున్నారు. గత ప్రభుత్వం కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్‌ నిర్మాణం కోసం రూ. 5.45 కోట్లు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కారణంగా మార్కెట్‌ నిర్మాణానికి నోచుకోలేదు.

వ్యాపారుల సిండికేట్‌తో నష్టాలు..

కొన్నేళ్ల క్రితం వరకు కొల్లాపూర్‌ రైతులు మామిడి పంట అమ్ముకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లే వారు. పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు కొంతమేర ఉపశమనం లభించింది. అయితే స్థానిక వ్యాపారులు కూడా హైదరాబాద్‌ సిండికేట్‌తో కుమ్మకై ్క ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. ప్రతి సంవత్సరం సీజన్‌ ప్రారంభంలో కొన్ని రోజులు అధిక ధరలు పెట్టి.. ఆ తర్వాత ధరలను తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు మార్కెట్‌ నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుంది.

స్థల పరిశీలనకే పరిమితం..

కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లి శివారులోని దేవాదాయశాఖ భూమిలో మామిడి మార్కెట్‌ ఏర్పాటుకు మొదట అధికారులు శ్రీకారం చుట్టారు. 19 ఎకరాల విస్థీర్ణంలో మార్కెట్‌ ఏర్పాటుచేసి.. అందులోనే కొనుగోళ్లు, మామిడి కాయలు నిల్వ ఉంచేందుకు గోదాములు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయించారు. స్థల సేకరణ కోసం దేవాదాయశాఖకు ప్రభుత్వం ద్వారా లేఖ పంపించారు. అయితే భూ బదాలాయింపునకు దేవాదాయశాఖ అధికారులు ముందుకు రాలేదు. లీజు ప్రకారం ఇస్తామని చెప్పారు. అది కూడా రెండేళ్లకో సారి రెన్యువల్‌ చేసుకునేలా ప్రతిపాదనలు చేశారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇందుకు విముఖత వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గోదాములు, కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసి.. రెండేళ్లకోసారి రెన్యువల్‌ చేసుకోవాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుందని వారు దేవాదాయశాఖ ప్రతిపాదనలను తిరస్కరించారు. కనీసం 20 నుంచి 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే మార్కెటింగ్‌ నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రామాపురం శివారులోని గుట్టపై మార్కెట్‌ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. అయితే అక్కడ మార్కెట్‌ నిర్మాణానికి స్థలం అనువుగా లేదని ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక ఇవ్వడంతో అక్కడ కూడా నిర్మాణం జరగలేదు. చివరగా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మార్కెట్‌ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

కొల్లాపూర్‌లో కలగా మారిన మార్కెట్‌ నిర్మాణం

పండ్ల విక్రయాలకు

రైతులకు తప్పని అవస్థలు

ప్రైవేటు వ్యాపారుల

సిండికేట్‌తో నష్టాలు

మామిడి మార్కెట్‌

ఏర్పాటుతోనే రైతులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement