
‘విధి పరీక్ష పెట్టింది’
గద్వాలటౌన్ : తండ్రి మృతి చెందాడనే దుఃఖాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. ధరూర్ మండలం మార్లబీడు గ్రామానికి చెందిన శ్రీనాథ్ స్థానిక కాకతీయ టెక్నో స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్నాడు. విద్యార్థి తండ్రి కిషోర్, తల్లి పవిత్ర, చెల్లి శిరీష సోమవారం హైదరాబాద్ నుంచి గద్వాలకు కారులో వస్తున్నారు. జడ్చర్ల సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రి కిషోర్ అక్కడిక్కడే మృతి చెందారు. తల్లి, చెల్లికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రి కిషోర్ మృతదేహాన్ని మార్లబీడు గ్రామానికి తీసుకు వచ్చారు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి తండ్రి కిషోర్ మృతదేహం వద్ద రోదిస్తూ కూర్చిండిపోయారు. మరోపక్క గాయాలతో తల్లి, చెల్లి తల్లడిల్లిపోతున్నారు. ఒకవైపు భవిష్యత్.. మరోవైపు దుఃఖాన్ని దిగమింగుకుంటూనే బుధవారం చివరి పరీక్ష రాయాలా.? వద్దా.? అనే సందిగ్ధంలో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విద్యార్థి శ్రీనాథ్‌కు బంధువులు మనోధైర్యం కల్పించారు. బాధాతప్త హృదయంతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పుట్టెడు దుఃఖంలో సాంఘికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. ఈ దృశ్యం బంధువులు, స్థానికులను కంటతడి పెట్టించింది.
దుఃఖాన్ని దిగమింగి.. హాజరైన విద్యార్థి