
కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు
నాగర్‌కర్నూల్ రూరల్: రాష్ట్రంలో కాగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కీలకమైన పదవులు సీఎం వద్ద ఉన్నప్పటికీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు. తక్షణమే రాష్ట్రంలో హోంమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. కమీషన్లపై ఉన్న ఆశ శాంతిభద్రతలను కాపాడటంలో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ఫలితంగా యువకులు వ్యసనాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిద్రావస్థలో ఉన్నారని, అగ్రకుల కబంధ హస్తాల్లో రాష్ట్రం నాశనం అవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. భూముల పరిరక్షణ కోసం విద్యార్థి నాయకులు చేస్తున్న పోరాటాలకు బీఎస్పీ అండగా ఉంటుందని, ప్రత్యక్ష పోరాటాలకు తాము సహకరిస్తామన్నారు. సమావేశంలో నాయకులు రామచందర్, దయానంద్, శివరామకృష్ణ, ధర్మేంద్ర, చంద్రశేఖర్, పృథ్వీరాజ్, నాగన్న, యూసుఫ్, కుమార్, హర్ష కల్యాణ్ పాల్గొన్నారు.