
జీపీఓలు అభద్రతకు గురికావొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఆప్షన్ల ద్వారా రెవెన్యూశాఖలోకి వస్తున్న జీపీఓ (గ్రామ పరిపాలన అధికారి)లు సర్వీసుపరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియమిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భారీఎత్తున పదోన్నతులు ఉంటాయని చెప్పారు. భూ భారతి ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్‌ఏ నుంచి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయన్నారు. జీఓ నంబర్ 317 ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిందని.. ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు సైతం చెట్టుకొక్కరికి, పుట్టకొక్కరికి పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. పదేళ్ల తర్వాత 330 మందిని అధికారికంగా అవుట్ సోర్సింగ్ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, నారాయణపేట అడిషనల్ కలెక్టర్ బెంజ్‌శాలం, ఆర్డీఓ నవీన్, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణ, వెంకట్‌రెడ్డి, రాములు, రమేశ్ పాక, రాంరెడ్డి, బిక్షం, రాధ, పాల్‌సింగ్, ఉపేందర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.