మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మెల్‌బోర్న్‌లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం
ధర రూ.2,259
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,259, కనిష్టంగా రూ.1,809గా నమోదయ్యాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,666గా ధరలు లభించాయి. సీజన్ ప్రారంభం కావడం వల్ల మార్కెట్‌కు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. మార్కెట్‌కు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. తిరిగి సోమవారం మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అవుతుందని, రైతులు ఈ విషయం గుర్తించుకొని సహకరించాలని కోరారు.
స్థానిక ఎన్నికలపై
కార్యాచరణ సిద్ధం చేయండి
పాలమూరు: జిల్లాలో ఈనెల 6 నుంచి 13 వరకు ప్రతి బూత్‌స్థాయిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 25 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు చేపట్టాలన్నారు. వక్ఫ్‌బోర్డు సవరణ, జనగణన అంశాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లాలన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు ఎక్కడిక్కడ ఘనంగా చేపట్టాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికలపై కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బూత్ కమిటీలు, మండల కమిటీలు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, వీర బ్రహ్మచారి, బాలరాజు, ఎగ్గని నర్సింహులు, రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల జీతాలు
పెంచకపోవడం సిగ్గుచేటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశ సంపదకు కారకులైన కార్మికులు, శ్రామికుల జీతాలు పెంచకుండా ఎంపీల జీతాలు పెంచుకోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యండీ యూసుఫ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభల సందర్భంగా సీపీఐ కార్యాలయం ఎదుట జెండా ఎగురవేసి, అక్కడి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ భవన్‌లో మహాసభలను ప్రారంభించి, మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రపూరిత విధానాల ఫలితంగా దేశ కార్మిక వర్గం తీవ్రమై న శ్రమదోపిడీకి గురవుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను సవరణల పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికుల సంక్షేమానికి సమాధి కడుతున్నారని ఆరోపించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ నిధికి భారీగా కోత లు విధించారని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ కార్మిక వర్గం లేకుంటే దేశ అభివృద్ధి శూన్యమన్నారు. కార్మికులు రాజకీయ చైతన్యవంతులు మారా లని పిలుపునిచ్చారు. నాయకులు సత్యనారాయణ, పి.సురేష్, బాగి కృష్ణయాదవ్, కోటకదిర నర్సింహ, ఆంజనేయులు పాల్గొన్నారు.
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి