
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో బీసీల స్థానం ఎక్కడ?
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో బీసీలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌సాగర్ అన్నారు. స్థానిక బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇప్పటివరకు బీసీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అగ్రవర్ణాల వారే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీలు దాదాపు 65 శాతం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా మంది బీసీలకు కాస్త అయినా న్యాయం జరుగుతుందని భావించిన బీసీ సమాజానికి అన్యాయమే జరిగిందన్నారు. సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మికాంత్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు అశ్విని సత్యం, బీసీ సమాజ్ భూత్పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు, నవీన్‌గౌడ్, భీమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.