
వైభవం.. రాములోరి కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళల మంగళ హారతులు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండకు తరలిరాగా జనసంద్రమైంది. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దేవస్థానం చైర్మన్ ఆళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
జనసంద్రమైన మన్యంకొండ
లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం
శ్రీరామకొండ క్షేత్రంలో ఘనంగా వేడుకలు
పాల్గొన్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం దంపతులు
భక్తులకు అన్నదానాలు
బీచుపల్లిలో ప్రత్యేకపూజలు
బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, అభిషేకములను నిర్వహించి సీతారాములకు ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు. వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో సీతారాములకు వైభవంగా కల్యాణాన్ని జరిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గద్వాల జిల్లా జడ్జి కుష కుటుంబ సమేతంగా రాములోరి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, డీఎస్పి మొగులయ్య, సిఐ రవిబాబు, అర్చకులు, పాలక మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

వైభవం.. రాములోరి కల్యాణం