
రెట్టింపు లాభాలొచ్చే పరిశోధనలు రావాలి
బిజినేపల్లి : వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రైతులకు రెట్టింపు లాభాలు అందించేలా పరిశోధనలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ సలహా సంఘం చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడారు. పరిశోధనల ద్వారా సత్ఫలితాలిచ్చిన మేలు రకం పంటలను రైతులకు అందించాలని, సరైన యాజమాన్య పద్ధతులను వారికి సకాలంలో వివరించి దిగుబడులు పెంచాలన్నారు. వాణిజ్య పంటలనే కాకుండా ధాన్యం పంటలను రైతులు సాగు చేసేలా చూడాలన్నారు. పీజేటీఏయూ పరిశోధన సంచాలకులు డా.ఎం.బలరాం మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆహార పంటలు, పప్పు దినుసులు, నూనెగింజల పంటలు అధికంగా పండిస్తారని అన్నారు. గత సంవత్సరం సాగులో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ విశ్వ విద్యాలయం అధిక దిగుబడుల్ని, చీడపీడలను తట్టుకునే వంగడాలను సృష్టించాలన్నారు. స్వల్పకాల పరిమితి రకాలను వృద్ధి చేయాలన్నారు. విస్తరణ సంచాలకులు డా.యం.యాకాద్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పద్ధతులను, సమాచారాన్ని వివిధ రకాల వినూత్న కార్యక్రమాలను చేపడుతూ రైతులకు సమయానుసారంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డా.సుధాకర్, శాస్త్రవేత్తలు సూచరిత, రామాంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
దక్షిణ తెలంగాణలో పప్పు దినుసులు, నూనెగింజల
సాగు అధికం: పీజేటీఏయూ పరిశోధన సంచాలకులు డా.ఎం.బలరాం