
మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుకొనేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. సహాయక సిబ్బంది నిత్యం 20మీటర్ల వరకు మట్టి తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు వేగం పెంచారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు సలహాలు,సూచనల మేరకు రెస్క్యూ బృందాలు ముందుకు సాగుతున్నారు. ఉబికి వస్తున్న నీటి ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం ప్రమాదానికి ప్రధాన కారణం నీటి ఊటేనని జీఎస్‌ఐ,సీఎస్‌ఐ,ఎన్‌జీఆర్‌ఐలు నిర్థారించారు. వారి పర్యవేక్షణలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మినహా మిగిలిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతూ వెంటిలేషన్, కన్వేయర్ బెల్టు పొడిగింపు, టీబీఎం స్టీల్ భాగాల కత్తిరింపు వంటి పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 రకాల సహాయక బృందాలకు చెందిన సిబ్బంది 47రోజులుగా గాలిస్తున్నా వారి అచూకీ నేటికీ లభ్యం కాలేదు.బుధవారం సొరంగం లోపల కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులతో పాటు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి, బురద,రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి త వ్వకాలు పూర్తి అయిన ప్రదేశం వరకు లోకో ట్రైన్ వెళ్లే విధంగా ట్రైన్ ట్రాక్ పొడగించే పనిలో నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మైన్స్ సీనియర్ శాస్త్రవేత్త జీసీ నవీన్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీ నివాసులు,కంపెనీ సీనియర్ ఇంజనీర్ సంజయ్ కు మార్‌సింగ్ ప్రమాద ప్రదేశంలో పరిస్థితులను క్షుణంగా పరిశీలించి సూచనలు, సలహాలు చేస్తున్నారు.
లోకో ట్రాక్ పునరుద్ధరణ
ప్రమాద ప్రదేశం సమీపం వరకు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అన్నారు. బుధవారం సొరంగం ఇన్‌లేట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మట్టి తవ్వకాలకు అనుగుణంగా లోకో ట్రైన్ ట్రాక్ వెళ్లేవిధంగా మార్గం చేస్తున్నారని చెప్పారు. టీబీఎం స్టీల్ బాగాలు కత్తరింపు పనులు,డీవాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగతుందన్నారు. కన్వేయర్ బెల్టు, వెంటిలేషన్ ప్రక్రియ ముందుకు కొనసాగిస్తున్నామని, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారన్నారు.అర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
ఉబికి వస్తన్న నీటితో ఆటంకం
47రోజలుగా కొనసాగుతన్న
సహాయక చర్యలు