
పెళ్లి ఊరేగింపులో అపశుృతి
గద్వాల క్రైం: పెళ్లి కుమారుడి స్నేహితులు, డీజే నిర్వాహకుడి మధ్య జరిగిన ఘర్షణలో 10 మందికిపైగా గాయపడిన ఘటన గురువారం తెల్లవారుజామున పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జిల్లాకేంద్రంలోని గజ్జెలమ్మవీధికి చెందిన కుర్వ రామచంద్రి, సత్యమ్మ కుమారుడు అమృత్‌కు ధరూర్ మండలం చింతరేవులకు చెందిన యువతితో బుధవారం ఉదయం పట్టణంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో జరిగింది. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి వద్ద ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటలకు పెళ్లి కుమారుడి స్నేహితులు మద్యం తాగి చిందులు వేస్తూ సౌండ్ బాక్స్‌లను కిందకు నెట్టడంతో పాటు డీజే నిర్వాహకుడిపై దాడి చేశారు. దీంతో అతను తన జేబులో ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో యువకుల తల, శరీర భాగాలకు గాయాలయ్యాయి. అక్కడున్న పలువురు వారిని నియంత్రించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో..
స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, గద్వాల, ధరూర్, కేటీదొడ్డి ఎస్‌ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు క్షణాల్లో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘర్షణకు దారి తీసిన అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన తీరును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వస్తువులు, సామగ్రి ధ్వంసం కావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనపై పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కత్తితో దాడి.. 10 మందికి గాయాలు

పెళ్లి ఊరేగింపులో అపశుృతి