
కేంద్రం జేబులో కృష్ణా ట్రిబ్యునల్
వనపర్తి: కృష్ణానదిలో నీటి వాటా తేల్చే కృష్ణా ట్రిబ్యునల్ కేంద్రం జేబులో ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు గడుస్తున్నా.. నేటికీ కృష్ణానదిలో నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇటీవల శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ లైనింగ్ పనులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణకు సాగునీటి కష్టాలు తెచ్చిపెట్టనుందని.. లైనింగ్ పనులతో కాల్వ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 89,762 క్యూసెక్కులకు పెరుగుతుందని వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులు నాగార్జునసాగర్, కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా బలపడటానికి నీటి లభ్యతను పెంచే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తోందని.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేఆర్‌ఎంబీ ఏపీ ప్రయత్నాలను నిలువరించడం లేదని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి సిర్సవాడ కాల్వతో నల్లగొండ ప్రాంతానికి సాగునీటిని అందించవచ్చని.. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ నుంచి టన్నెల ద్వారా నీరు తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇందుకుగాను మొదటి విడతగా రూ.1,300 కోట్లకు టెండర్ సైతం నిర్వహించారని.. తక్కువ ఖర్చుతో అయ్యే పనికి రూ.వందల కోట్లు వెచ్చించడం సీఎం బంధువులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకేనని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ నుంచి నల్గొండకు నీరు తరలించేందుకు ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు, తనతో పాటు ఎంపీ సైతం సంతకం చేసి అప్పటి ముఖ్యమంత్రికి లేఖలు రాశామని గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు తిరుమల్, రహీం, గులాం ఖాదర్, కురుమూర్తి యాదవ్, నందిమళ్ల అశోక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు–రంగారెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి