
ఉమ్మడి పాలమూరుపై ఎందుకీ వివక్ష
అచ్చంపేట రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై పాలకుల దోపిడీ విధానం కొనసాగుతోందని, ఇక్కడి రైతాంగ భూములను నిండా ముంచి నల్లగొండ జిల్లాకు నీరు తరలించుకుపోతున్నారని.. ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో జల వనరుల సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ.. పాలకుల స్వార్థ బుద్ధి, మన ప్రాంత ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యం వలన దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా అనేక విధాలా నష్టపోతుందన్నారు. జిల్లా జల వనరుల సమస్యలపై ఇతర సమస్యలు తెలియజేస్తూ జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ అందజేయగా.. ఒక్కసామస్య పరిష్కరించలేదన్నారు. పోరాడి సాధించుకున్న పీఆర్‌ఎస్‌ఐ పథకం నీళ్లు నల్లగొండ జిల్లాకు తరలించుకుపోవడానికి ఆగమేఘాల మీద క్యాబినెట్ ఏర్పాటు, తీర్మానం చేసి, జనవరి 22న ఏకంగా జీవో 11 విడుదల చేశారన్నారు. ఏదుల నుంచి సొరంగం ద్వారా నీటిని బయటికి తీసి మన జిల్లా రైతాంగ భూములను ముంచి నల్లగొండ జిల్లాకు నీరు తరలించుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి ఒక్కరూ సంఘటితమవ్వాలి
ఇలాంటి కుట్రలు, అన్యాయాన్ని, జల దోపిడీని అడిగి నిలదీసే స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా పోయారని, నల్లగొండ జిల్లాకు నీళ్ల తరలింపు కోసం పెడుతున్న శ్రద్ధ మన ఎత్తిపోతల పథకాలపై ఎందుకుండటం లేదన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల జాతరలో ఉమామహేశ్వర చెన్నకేశవ రిజర్వాయర్లు నిర్మిస్తామని, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని వాగ్దానం చేసి సరైన విధానం ఏది లేక ప్రజలను గందరగోళంలో ముంచి చేతులెత్తేసిందన్నారు. అమ్రాబాద్ ఎత్తిపోతల కోసం ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించ తలపెట్టిన ప్రాంత గ్రామాల రైతులు తమ భూములు పూర్తిగా మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. జలవనరుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘటితమవ్వాల్సిన అవరసరం ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, రామస్వామి, గోపాల్, వెంకటేష్, బాలస్వామి, నారాయణ, నాగయ్య, ఇంద్రారెడ్డి, సీతారాంరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
నీటి ప్రాజెక్టులపై పాలకుల దోపిడీ విధానాన్ని ఎండగడుదాం
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి