
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాజ్యాంగ ఫలాలు ప్రజలు అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ విజయేందిర అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులకు ఎవరు భంగం కల్పించవద్దని అన్నారు. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలను పరిశీలించి అత్యంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని మన దేశ ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు.
ప్రపంచ మేధావి: ఎంపీ డీకే అరుణ
అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అణగారిన వర్గాల ఆశా జ్యోతి అంబేడ్కర్ అని పేర్కొన్నారు.