
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్‌పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్‌ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్‌ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు
గంటన్నర వరకు కదలని రైతులు
నిలిచిన వాహన రాకపోకలు