
ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలి
పాలమూరు: జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరిష్కారం అయ్యే విధంగా బ్యాంకు మేనేజర్లు దృష్టిపెట్టాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్‌లో శుక్రవారం అన్ని రకాల బ్యాంకు మేనేజర్లు, ఫైనాన్స్ సంస్థలు, స్టాక్‌హోల్డర్స్‌తో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఐ యాక్ట్ కేసులలో త్వరగా సెటిల్‌మెంట్ లభించే విధంగా చూడాలన్నారు. ఎన్‌ఐ యాక్ట్ కేసులలో ఉన్న కక్ష్యిదారులు అందరికీ నోటీసులు పంపించి ప్రత్యేక లోక్ అదాలత్‌కు తప్ప క హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క కక్ష్యిదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
రేపు పెన్షనర్స్
కార్యవర్గ సమావేశం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిలుగౌడ్, కార్యదర్శి బాల్‌కిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గ పదవీకాలం ఈ నెల 5న ముగిసిందని, ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. సమావేశానికి పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు.
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలి

ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలి