
కేసీఆర్‌తోనే తెలంగాణ గోసకు విముక్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం రాష్ట్ర ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని, ఆయన రాకతోనే తెలంగాణ గోసకు విముక్తి లభిస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు ప్రజలు మోసపోయి వారిని గెలిపించారన్నారు. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, ఆయన వస్తేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కనీసం రైతులు పండించిన వడ్లను కూడా కొనలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సంచులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలో రైతులు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల వారు ఉపాధి కోసం తెలంగాణకు వచ్చేవారని, ఇప్పుడు ఉన్న ఊరిని ప్రజలు వదిలి వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, ఎన్నికలు ఎప్పుడు జరిగిన బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా చేస్తామన్నారు.
● పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర భద్రత పెంచాచాలని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆర్మీలో నియామకాలు ఎక్కువ సంఖ్యలో చేసి ప్రజలకు భద్రత కల్పించాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు గంజి వెంకన్న, నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్వరమ్మ, నరేందర్, గణేష్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.