
కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు
జడ్చర్ల: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని.. కల్తీ ఆహారం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ హెచ్చరించారు. సోమవారం జడ్చర్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతో పాటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో చికెన్ దుర్వాసన రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంటర్‌లోని బిర్యానీ తదితర వంట పదార్థాలను పరిశీలించగా.. చికెన్‌లో బొద్దింక కనిపించింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో హల్‌చల్ అయ్యింది. వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి రూ. 5వేల జరిమానా విదించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత అధికారి మనోజ్ తనిఖీలు చేపట్టారు. తాజ్ ఫుడ్ కోర్టుతో పాటు ఇతర ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను పరిశీలించారు. వంటశాలలు, చికెన్ బిర్యానీ తదితర ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు తగ్గినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పాల విక్రయ కేంద్రాల్లో కల్తీ జరిగినట్లు రుజువు అయితే చర్యలు తప్పవన్నారు. కాగా, ఇంతకు ముందు కూడా కొత్త బస్టాండ్ సమీపంలోని గజ ఫుడ్‌కోర్టులో బిర్యానీలో బొద్దింక వచ్చింది. వినయోగదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారని.. మిగతా అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో తనిఖీలు చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్బంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.