మంచిర్యాల రూరల్: ఉపాధి హామీ పథకం అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదని డీఆర్‌డీఓ బి.శేషాద్రి స్పష్టం చేశారు. మంగళవారం హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం 2వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో 2020 డిసెంబర్ ఒకటి నుంచి 2023 మార్చి 31వరకు చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాయి.
ఈ సందర్భంగా పనుల్లో జరిగిన తప్పులు, నిధుల దుర్వినియోగం గుర్తించారు. పక్కదోవ పట్టిన నిధులను రికవరీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మండలంలో 835 ఉపాధి పనులు చేపట్టగా రూ.7.45 కోట్లపై విలువైన పనులు జరిగాయని, పంచాయతీ రాజ్ పరిధిలో 160 పనులకు రూ.4.51 కోట్లకు పైగా విలువైన పనులు జరిగాయని, అటవీ శాఖ పరిధిలో రూ.2.68 లక్షలతో పనులు జరిగినట్లు తెలిపారు.
కొలతలు, రికార్డుల విషయంలో లోపాలు జరిగాయని, ఉపాధి హామీ పనులు తప్పుల తడకగా జరిగాయని తనిఖీ బృందాలు తేల్చిచెప్పాయి. డీఆర్‌డీఓ శేషాద్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, జెడ్పీ కో ఆప్షన్ నహీంపాషా, అదనపు డీఆర్‌డీఓ దత్తారావు, డీవీఓ సురేశ్, ఎస్‌టీఎం నరేందర్, అంబుడ్స్‌మెన్ పర్సన్ శివరామ్, క్వాలిటీ కంట్రోలర్ చంద్రశేఖర్, విజిలెన్స్ మేనేజర్ కిరణ్, ఎస్‌ఆర్‌పీ భగవంత్‌రావు, ఎంపీడీఓ అబ్దుల్‌హై, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఏపీఓ మల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment