విజయోస్తు..!
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● జిల్లాలో 23 కేంద్రాలు ఏర్పాటు ● చేతి గడియారాలకు నో.. ● నిమిషం నిబంధన నుంచి ఉపశమనం
అల్ఫోర్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న డీఐఈవో అంజయ్య
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 23పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హాల్‌టికెట్లపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడో తెలుసుకోవచ్చు. ప్రశ్నపత్రంపై ముద్రించే క్రమసంఖ్య ఆధారంగా ఏ సంఖ్య పేపర్ ఏ విద్యార్థికి వెళ్తుందో తెలియనుంది. ఈ ఏడాది పరీక్ష కేంద్రంలోకి చేతిగడియారాలనూ అనుమతించడం లేదు. పరీక్షల్లో అవకతవకలకు తావు లేకుండా, సజావుగా సాగేందుకు ఇదివరకే కలెక్టర్ కుమార్ దీపక్ పోలీసు, విద్య, వైద్యశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో సమీక్షించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 10, టీఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 2, ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 8లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12,540 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ 10,950మంది, ఒకేషనల్ 1,950 మంది పరీక్షలు రాయనున్నారు. జనరల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 5625, ద్వితీయ సంవత్సరం 4965, ఒకేషనల్ విద్యార్థులు 935, ద్వితీయ సంవత్సరం 1015 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు 23 మంది, డిపార్ట్‌మెంట్ అధికారులు 23, కస్టోడియన్లు 4, ఇన్విజిలెటర్లు 360 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ిరెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.
కేంద్రాల గుర్తింపునకు యాప్
ఇదివరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల చిరునామా తెలుసుకోవడంలో ఇబ్బంది పడిన నేపథ్యంలో కేంద్రాల గుర్తింపునకు యాప్ తీసుకొచ్చారు. ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చా రు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్‌లో కూడా నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేవెసులుబాటు కల్పించినట్లు అధికారులు ప్రకటించారు.
పరీక్షలంటే భయం వీడండి
ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేశాం. నిఘా కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నాం. విద్యార్థులు భయం వీడి ప్రశాంతమైన వాతవరణంలో పరీక్షలు రాయాలి. క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తాం.
– అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment