విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలన
కోటపల్లి: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వ హించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆన్నారు. మంగళవారం మండలంలోని పంగిడిసోమారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయ న సందర్శించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ప్రతీరోజు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని తెలిపారు. ఆంగన్‌వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలు లేక చాలా ఏళ్లు గడుస్తోందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ నర్సరీని పరిశీలించి మొక్కలకు సకాలంలో నీరందించాలని, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణను ఆదేశించారు. శెట్‌పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
చెన్నూర్‌రూరల్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున్‌తో కలిసి మంగళవారం జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని అమ్మి మద్దతు ధర పొందాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. కొనుగోలు పూర్తయిన ఏడు రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్తి కొనుగోళ్లు, ప్రెస్సింగ్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఎంపీడీవో మోహన్, సీసీఐ అధికారులు, ఏఈవోలు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి వరిధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వివిధ ఏజెన్సీ, రైస్‌మిల్లర్లతో కలిసి యాసంగి వరిధాన్యం కొనుగోలు సన్నాహాక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు సన్నరకం ధాన్యానికి వ్యవసాయ విస్తరణాధికారి ధ్రువీకరణ పత్రం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి షాబొద్దీన్, జిల్లా వ్యవసాధికారి కల్పన, జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment