ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బలవన్మరణం
తాంసి(బోథ్): ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఒకరు బలవన్మరణం చెందిన సంఘటన భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొంటిముక్కుల విలాస్ (42) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. తీర్చేమార్గం కనిపించకపోవడంతో కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా రాత్రి గ్రామ శివారులో మృతదేహం కనిపించింది. భీంపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మంగళవారం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ముంతాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment