కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
నేరడిగొండ(బోథ్): మండలంలోని చించోలి అంతర్రాష్ట్ర రహదారి సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి(బి) గ్రామానికి చెందిన మదన్, సుజాత, రాధ, లింగవ్వ, వేదాన్ష్ సోమవారం బజార్‌హత్నూర్‌లో జరిగిన శుభకార్యానికి కారులో వెళ్లారు. మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణంలో చించోలి గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. సుజాత, రాధ, లింగవ్వ, వేదాన్ష్‌కు తీవ్రగాయాలు కావడంతో ముందుగా బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
తాండూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పట్టుకున్నట్లు జిల్లా మైనింగ్ శాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. టేకులపల్లి నుంచి తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి ఇసుకను అనుమతి లేకుండా తీసుకువస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నామని, సదరు ట్రాక్టర్‌ను విచారణకోసం రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
గంజాయి కేసులో ఏడేళ్ల జైలు
ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో ఒకరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50వేల జరిమానా విధిస్తూ మంగళవారం జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పునిచ్చినట్లు సిర్పూర్ (యూ) ఎస్సై రామకృష్ణ తెలిపారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్సై విష్ణువర్దన్ 2021 అక్టోబర్ 24న మధుర తాండ గ్రామ శివారులో పత్తి చేనులో తనిఖీ నిర్వహించగా భానుదాస్ పత్తి చేనులో గంజాయిని సాగు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి ఎస్‌హెచ్‌ఓ గంగారం కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడు భానుదాస్‌కు పైవిధంగా శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
మూడు ఆలయాల్లో చోరీ
జన్నారం: మండలంలోని తిమ్మాపూర్ శ్రీ రామచంద్రస్వామి ఆలయంతో పాటు పక్కనే ఉన్న సత్యనారాయణస్వామి, శివాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయాల్లో హుండీలను పగుల కొట్టి నగదును అపహరించుకుపోయినట్లు వారు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కమ్మల భూమయ్య, శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పశువుల కొట్టం దగ్ధం
దహెగాం: మండలంలోని బొర్లకుంటలో సొనులే పోశన్నకు చెందిన పశువుల కొట్టం మంగళవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కొట్టంలో ఉన్న కేసింగ్ పైపులు రెండు, ఆయిల్ ఇంజన్ పైపులు ఇరవై, పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని బాధిత రైతు పేర్కొన్నాడు. సుమారు లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఆర్‌ఐ శృతి పంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment