ఖి‘లేడి’ల అరెస్ట్
● ఆదిలాబాద్‌లో బంగారు అభరణాల చోరీ ● భర్తతోపాటు ఇద్దరు భార్యల తతంగం
ఆదిలాబాద్‌టౌన్: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న భర్తతో పాటు ఇద్దరు భార్యలను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా చికల్తానా గ్రామానికి చెందిన తేజ్ షిందేకు మైనా షిందే, జ్యోతి షిందే ఇద్దరు భార్యలు. ఫిబ్రవరి 23న మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. ఉట్నూర్ మండలంలోని నాగాపూర్‌కు చెందిన ఏరుకొండ లక్ష్మి తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా సహాయపడినట్లుగా ఆమె చేతిలో నుంచి బ్యాగు తీసుకున్నారు. మీరు బస్సు ఎక్కండని చెప్పి బ్యాగులో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు బ్యాగు చూసుకోగా ఆభరణాలు కన్పించకపోవడంతో ఆందోళనకు గురై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్‌చౌక్ ఏరియాలోని రాజరాజేశ్వరస్వామి బట్టల దుకాణంలో గంగమ్మకు చెందిన 19 గ్రాముల పుస్తెల తాడు ఎత్తుకెళ్లగా వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం ఆదిలాబాద్ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. వారి నుంచి మూడు గ్రాముల ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. తేజ్ షిందే పరారీలో ఉన్నాడు. మిగతా బంగారం తమ భర్త వద్ద ఉందని ఆ మహిళలు చెప్పినట్లుగా సీఐ వెల్లడించారు. పట్టుకున్న వారిలో ఎస్సై విష్ణు ప్రకాష్ , సిబ్బంది బబిత, అనసూయ, సౌజన్య, నరేందర్ , కుంట ప్రవీణ్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment