సోలార్ పవర్‌ప్లాంట్లకు స్థల పరిశీలన
నెన్నెల/దండేపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాలను రెడ్‌కో సంస్థ మేనేజర్ శ్రీమన్నారాయణ, డీఆర్‌డీవో కిషన్ మంగళవారం పరిశీలించారు. నెన్నెల శివారులోని సర్వేనంబరు 671లో నాలుగు ఎకరాలు సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు కేటాయించారు. ఒక మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, రెండు కిలోమీటర్ల దూరంలోనే 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఉండడంతో ఉత్పత్తి చేసిన విద్యుత్ విక్రయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ప్లాంట్ల ఏర్పాటుతో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామ పంచాయతీ పరిధి అందుగులపేటలో స్థలాన్ని పరిశీలించారు. నాలుగు ఎకరాల స్థలంలో రూ.3కోట్లతో సోలార్‌పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, డీపీఎం సంజీవ్, ఏపీఎంలు విజయలక్ష్మి, పంజాల ప్రకాష్‌గౌడ్, ఏపీవో నరేష్, ఎంఆర్‌ఐ సులోచన, దండేపల్లి ఎంపీడీవో ప్రసాద్, ఆర్‌ఐ భూమన్న, విద్యుత్ ఏఈ బాపు, ఏపీఎం బ్రహ్మయ్య, ఏపీవో దుర్గాదాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment