విధి నిర్వహణలో ఆగిన ఊపిరి..
● ఐకే–1ఏ గనిలో యువ కార్మికుడి మృతి ● విధులు నిర్వహిస్తుండగా కుప్పకూలిన వైనం.. ● గని ప్రమాదంగా గుర్తించాలని కార్మిక సంఘాల డిమాండ్
జైపూర్:ఆయన ఓ యువ కార్మికుడు. మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ ద్వారా మూడేళ్ల క్రితం సింగరేణి ఉద్యోగం పొందాడు. శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఐకే–1ఏ గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం దాసరిపల్లి నుంచి నిత్యం విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే సోమవారం ఉదయం విధులకు వచ్చాడు. విధులు నిర్వహిస్తూనే కుప్పకూలాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాసరిపల్లి గ్రామానికి చెందిన పసునూరి సుభద్ర–రాజమల్లు దంపతుల కుమారుడు రాంచందర్(32) తన తండ్రి మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ ద్వారా మూడేళ్ల క్రితం ఉద్యోగం పొందాడు. ఐకే–1ఏ గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాంచందర్ భూగర్భ గనిలోకి కార్మికులు వెళ్లే రెండో మ్యాన్‌రైడింగ్ వద్ద మోటార్ ఆన్, ఆఫ్ సిస్టం మెయింటెన్స్ వర్కక్ కేటాయించారు. ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు రెండో మ్యాన్ రైడింగ్ ద్వారా కార్మికులు గనిలోకి దిగగా రాంచందర్ మ్యాన్ రైడింగ్ ఆపరేట్ చేశాడు. 9:20 తర్వాత కళ్లు తిరగడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచర కార్మికులు సపర్యలు చేశారు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో సీపీఆర్ కూడా చేశారు. అయినా స్పందన లేకపోవడంతో హుటాహుటీగా రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఒక్కగానొక్క కొడుకు..
సుభద్ర–రాజమల్లు దంపతులకు రాంచందర్, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు కావాలని రాజమల్లు మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ ద్వారా తన ఉద్యోగాన్ని మూడేళ్ల క్రితం కొడుకుకు పెట్టించాడు. అప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అకస్మాత్తుగ ఒకకగానొక్క కొడుకు విధి నిర్వహణలో మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజమల్లు ఫిర్యదు మేరక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గని ప్రమాదంగా గుర్తించాలి..
రాంచందర్ మరణాన్ని గని ప్రమాదంగా గుర్తించి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల స్పెషల్ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హెచ్‌ఎంఎస్ నాయకులు తిప్పారపు సారయ్య, అనిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. యువ కార్మికుడు విధినిర్వహణలో మరణించడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో కార్మికుడు ఏ కారణంతో మరణించినా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఐకే–1ఏ గనిలో శ్రీనివాస్ అనే యువ కార్మికుడు చనిపోయాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment