
వంటింటిపై గ్యాస్ భారం
● సిలిండర్‌పై రూ.50 పెంపు ● జిల్లాపై రూ.1.56 కోట్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతుండగా.. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో మరింత భారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర మంగళవారం నుంచే అమలులోకి వచ్చింది. జిల్లాలో దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్, జనరల్ కనెక్షన్లు, కమర్షియల్ మొత్తం కలిపి 3,13,028 ఉన్నాయి. సరాసరిన నెలకు ఒక్కో గ్యాస్ సిలిండర్ చొప్పున వినియోగిస్తే వంటింటి బడ్జెట్‌పై అదనంగా రూ.50 చొప్పున రూ.1,56,51,540 మేర ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.877 ఉండగా.. పెరిగిన ధరతో రూ.927కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.500కే సిలిండర్ అందజేస్తోంది. సిలిండర్ బుక్ చేసినప్పుడు రూ.927 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద రూ.500కే సిలిండర్ పొందుతున్న వినియోగదారులు పెరిగిన ధరతో రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
సిబ్బంది అదనపు వసూళ్లు..
నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీకి ఐదు కిలోమీటర్ల పరిధిలోని కనెక్షన్లకు రవాణా చార్జీలు వసూలు చేయకూడదు. 15 కిలోమీటర్ల వరకు రూ.20, ఆపైన దూరంలోని వినియోగదారులకు ఇంటి చేర్చినందుకు రూ.30 చార్జీలుగా నిర్ణయించారు. గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే సిబ్బంది నిబంధలను పట్టించుకోవడం లేదు. ఐదు కిలోమీటర్లలోపు అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు, 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.100కు తక్కువ తీసుకోవడం లేదు.
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు, కనెక్షన్లు
గ్యాస్ ఏజెన్సీలు 22
గృహ సింగిల్, డబుల్ కనెక్షన్లు 2,04,360
దీపం 50,582
ఉజ్వల 32,009 సీఎస్‌ఆర్ 23,620
కమర్షియల్ 2,457
మొత్తం 3,13,028
పెంపుతో పడే భారం రూ.1,56,51,400