
రైలు కిందపడి యువకుడు బలవన్మరణం
మంచిర్యాలక్రైం: రైలు కిందపడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన నాగవెళ్లి శివశంకర్ (35)కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శివశంకర్ బుధవారం తెల్లవారు జామున స్థాఽనిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఏ క్యాబిన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య జయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.