
అద్దె వాహనం.. సొంత పనులు!
● విద్యుత్ శాఖ అధికారుల తీరు ● డ్రైవరు, ఉన్నతాధికారి మధ్య వివాదం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విధి నిర్వహణలో వినియోగించాల్సిన అద్దె వాహనాలను సొంతానికీ వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు, విధుల్లో రాకపోకల కోసం ఏడీ, డీఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులకు వాహనాల అనుమతి ఉంది. నెలవారీగా అద్దె చెల్లించే విధంగా ప్రైవేటు వాహనాలను సమకూర్చుతున్నారు. ప్రతీ నాలుగు నెలలకోసారి టెండర్ నిర్వహించి నిబంధనల ప్రకారం వాహనాలు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 17వాహనాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. కొందరు అధికారులు తమ సొంత వాహనాలే వాడుకుంటూ ఇతర వాహన పేర్లతో బిల్లులు తీసుకుంటున్నారు. చాలామంది అధికారులు తమకు కేటాయించిన చోట కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం వస్తూ వెళ్తున్నారు. వాస్తవానికి కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు మాత్రమే వాహనం వినియోగించాలి. అయితే తమ ఇంటి నుంచి సైతం అద్దె వాహనాలనే ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు వ్యక్తిగత పనులకు సైతం అద్దె వాహనాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహన యజమానులు కొందరు డీజిల్, డ్రైవర్, వాహన నిర్వహణ, మరమ్మతులు, ఇతర ఖర్చులు భరించలేకపోతున్నామని అంటున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో..
టెండర్లలో ఎంపిక చేసిన వాహనానికి ప్రతీ నెలకు రూ.36వేలు చెల్లింపుతో 2500కి.మీ తిరగాలి. క్యాంపర్, కార్లు సమకూర్చుకోవచ్చు. నెలవారీగా వాహనం తిరిగిన ప్రకారం రికార్డులు నమోదు చేసి బిల్లులు మంజూరు చేయాలి. ఎవరైనా వాహనదారుడు తమకు అనుకూలంగా లేకపోతే మళ్లీ వా హనానికి అనుమతి ఇవ్వరని చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇక అధికారులు తమకు కేటాయించిన కేంద్రాల్లో ఉండాలనే నిబంధన ఉన్నా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు ఇబ్బందితోపాటు డీజిల్ ఖర్చులు పెరుగుతున్నాయి. వాహనదారులు, అధికారులు సత్సంబంధాలతో బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లా ఉన్నతాధికారికి కేటాయించిన వాహన అద్దె విషయంలో య జమాని మధ్య వివాదం నెలకొంది. జిల్లాలో కాకుండా కరీంనగర్ దాక వాహనం నడపాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఎస్‌ఈ వి.గంగాధర్‌ను వివరణ కోరగా, అద్దె వాహనాల్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, ఓ వాహనదారు డు ఆరోపిస్తున్నట్లుగా ఏం జరగడం లేదన్నారు.