
దొంగల ముఠా అరెస్ట్
● బ్యాంక్‌లో గ్యాస్ కట్టర్లతో చోరీకి యత్నం ● తొమ్మిది మందిపై కేసు ● ముగ్గురి అరెస్టు, పరారీలో ముగ్గురు ● వేరే కేసుల్లో ఇప్పటికే జైలులో మరో ముగ్గురు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ
ఆదిలాబాద్‌టౌన్: బ్యాంక్‌కు కన్నం వేసి గ్యాస్ కట్టర్లతో చోరీకి యత్నించిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌రూరల్ మండలం రామాయి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో గతేడాది డిసెంబర్ 12న లోనికి చొరబడ్డారు. బ్యాంక్‌లో అమర్చిన మిషన్ డిటెక్షన్ అలారమ్ మోగడంతో పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది చోరీకి పాల్పడగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఆయా కాలనీలకు చెందిన వారు ఓ ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటుపడి పలు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంక్‌లో చోరీకి యత్నించారు. అలారం మోగడంతో పారిపోయారు. 9 మందిపై కేసులు నమోదు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారని, మరో ముగ్గురు వివిధ కేసుల్లో ఇదివరకే జైలులో ఉండగా, ప్రస్తుతం ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
నిందితులు వీరే..
ఆదిలాబాద్‌రూరల్ మండలం కచ్‌కంటి శివారులో పోలీసులకు ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని పట్టుకుని పోలీసులు విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దగడ్ సాయి, అశోక్, మినుగు రాజేశంను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పుష్ప అలియాస్ పవన్, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉన్నారని తెలిపారు. చవాన్ రవి, సుఖ్‌దేవ్ సన్నీ, గోవిందుడు కార్తీక్‌లు హత్యాయత్నం, మర్డర్ కేసులు, రౌడీ షీట్ నమోదై ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ 9 మందిపై ఆదిలాబాద్‌రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై ముజాహిద్ పాల్గొన్నారు.