
ఆర్జీయూకేటీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
బాసర(ముధోల్): బాసర ఆర్జీయూకేటీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్షన్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్య, సమానత్వం, న్యాయ పరిరక్షణ రంగాల్లో అంబేడ్కర్ మార్గదర్శకతను గుర్తు చేశారు. విద్యే మార్పుకు మూలం అనే ఆయన అభిప్రాయం నేడు అందరినీ ప్రేరేపిస్తోందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో విశ్వవిద్యాలయంలో మహనీయుల పుస్తకాలను లైబ్రరీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థుల్లో పుస్తక పఠనంతో పాటు జ్ఞానాన్ని సముపార్జించడానికి వేదిక అవుతుందన్నారు. పుస్తకం జీవితాన్ని మార్చే ఆయుధమని చెప్పిన అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, పాటలు, స్కిట్, డాన్స్, కవిత్వం, పోస్టర్ ప్రజెంటేషన్, తదితర పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డా.మహేష్, డా.విట్టల్, తదితరులు పాల్గొన్నారు.