
దైవదర్శనానికి వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
దిలావర్‌పూర్(నిర్మల్): దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఎల్.సందీప్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు చెందిన దిద్దోలి రాజు (45) కుటుంబం నర్సాపూర్(జి) మండలంలోని అర్లి వద్ద ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం తెల్లవారు జామున రాజు భార్య, ఇద్దరు పిల్లలు ఆటోలో పంపించారు. రాజు, అతని కుమారుడు కేదార్‌నాథ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగుప్రయాణంలో దిలావర్‌పూర్ మండలంలోని సిర్గాపూర్ సమీపంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా కేదార్‌నాథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని కేదార్‌నాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాహనంలో తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.