
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అందవెల్లి, బోడపల్లి గ్రామాలను అడ్డాలుగా చేసుకొని నకిలీ బీటీ –3 పత్తి విత్తనాలు కాగజ్‌నగర్ మీదుగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయనే పక్కా సమాచారంతో గ్రామంలో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అందవెల్లి గ్రామానికి చెందిన ఎన్.మహేందర్ ఇంట్లో వంద కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించినట్లు తెలిపారు. మహేందర్ మంచిర్యాల జిల్లాలోని పెద్దపేట్ గ్రామానికి చెందిన ఎస్‌కే సల్మాన్ వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని అందవెల్లి, బోడపల్లి, ఇట్యాల, రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మహేందర్ వద్ద నుంచి రూ. 3.50 లక్షల విలువైన క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమాయక రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్స్ మధు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.